News

ఏపీ సీఎం డ్యాష్‌బోర్డు దేశంలో బెస్ట్


ఆంధ్రప్రదేశ్ సీఎం డ్యాష్‌బోర్డును నీతిఆయోగ్‌ ప్రశంసించింది. సీఎం డ్యాష్ బోర్డు దేశంలో బెస్ట్‌ అని నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అన్నారు. తమ సీఎం డ్యాష్‌ బోర్డు నుంచి తాము చాలా నేర్చుకున్నామన్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటి సంరక్షణపై వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల్లో అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను పరిశీలిస్తున్నామని సీఎం చంద్రబాబుతో అమితాబ్‌ కాంత్‌ అన్నారు. ఉదయం నీతిఆయోగ్ సీఈవోతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఉత్తమ పద్ధతులను అవలంబించే రాష్ట్రాలకు ర్యాంకింగ్‌ ఇవ్వాలని ఈ సందర్భంగా నీతిఆయోగ్‌ను సీఎం చంద్రబాబు కోరారు. ఏపీలో అన్ని శాఖలను డిజిటలైజ్‌ చేశామని, రియల్‌ టైంలో జీఎస్‌డీపీని అంచనా వేస్తున్నామన్నారు. పల్స్‌ సర్వే పూర్తయితే ప్రభుత్వం చేతుల్లో సమగ్ర సమాచారం ఉంటుందని చెప్పారు. ప్రతి కుటుంబానికి రూ. 10 వేలు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అంతకుముందు నీతిఆయోగ్ చైర్మన్ పనగారియాను హోటల్ గేట్‌వేలో చంద్రబాబు కలిశారు. ఇద్దరూ కాసేపు ఏకాంతంగా చర్చించారు. అక్కడి నుంచి ఒకే కారులో క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు.